గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్ పర్యటన – అధికారులు, వైసీపీ నేతల మధ్య వివాదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారు. జగన్ రాకతో మిర్చి యార్డులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు జగన్ మిర్చిని పరిశీలించి, రైతులతో చర్చించనున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన జగన్, తన అనుచరులతో కలిసి మిర్చి యార్డుకు చేరుకున్న సమయంలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అనుమతి లేకుండా జగన్ పర్యటన కొనసాగడం వివాదాస్పదంగా మారింది.
మిర్చి యార్డు అధికారులు ఎన్నికల కోడ్ ఉన్నందున ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాజకీయ సమావేశాలు నిషేధమని ప్రకటిస్తూ మైక్‌లో అనౌన్స్‌మెంట్లు కూడా ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీంతో వైసీపీ నేతలు స్పందిస్తూ, జగన్ ఎలాంటి రాజకీయ సభ నిర్వహించరని, కేవలం మిర్చి రైతులతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చారని తెలిపారు. అయితే, పోలీసులు ఎన్నికల కోడ్ కారణంగా జగన్ పర్యటనపై దూరంగా ఉన్నారు.