కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేవ్స్ 2025 (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) ముంబైలో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇతర ఇండస్ట్రీల నుండి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నాగచైతన్య, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శ్రీలీల, శోభిత దూళిపాళ్ల వంటి ప్రముఖులు ముఖ్య ఆకర్షణగా నిలిచారు.

మొదటి రోజు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. సమ్మిట్ లో తెలంగాణ స్టాల్ ను నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున పాన్ ఇండియా సినిమాల ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, పుష్ప, బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాలు దక్షిణాదిలో మాత్రమే కాకుండా హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ సినిమాలు భారతీయ సినిమాల వినోదానికి క్రైటీరియా ఏర్పరచాయన్నారు.
నాగార్జున చెప్పినట్లుగా, ఈ సినిమాలు స్థానిక కథలను తెరపై తీసుకువచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాయి. బాహుబలి సినిమాని రాజమౌళి తెలుగుతనం తో రూపొందించారు, అందుకే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయం సాధించింది. పుష్ప, బాహుబలి, కేజీఎఫ్ వంటి సినిమాలు ప్రపంచ సినీప్రియులను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా సినిమాల రహస్యం స్థానిక కథలపై దృష్టి పెట్టడమే అని నాగార్జున అన్నారు.

ప్రస్తుతం, నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామిరంగ చిత్రంలో చివరగా కనిపించిన నాగార్జున, ప్రస్తుతం కుబేర, థగ్ లైఫ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.