విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని, నిందితుడు నవీన్‌ను తక్కువ సమయంలోనే అరెస్ట్ చేశారు. ఈ రోజు అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించి, బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా త్వరగా శిక్ష ఖరారు చేసేలా చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ తెలిపారు.
ఈ దాడిలో యువతి తల్లి లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఆమె మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రేమ పేరుతో నవీన్ గతంలో కూడా తమ కూతురిపై దాడి చేశాడని బాధితురాలి తండ్రి వెల్లడించారు. అయితే, ఆ సమయంలో నవీన్ భవిష్యత్తు నాశనం అవుతుందని ఫిర్యాదు చేయలేదని, పెద్దల సమక్షంలో పంచాయతీ ద్వారా పరిష్కరించారని చెప్పారు. కానీ, ఇప్పుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నవీన్‌కు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.