ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా, పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా, ఢిల్లీ పెద్దలతో సమావేశాలైనా శ్రీ వేంకటేశ్వరస్వామి ఫొటోలు, ప్రసాదాన్ని వెంట తీసుకెళ్లడం ఆయనకు పరిపాటిగా మారింది. ఎందుకంటే, ఏ పని తలపెట్టినా శ్రీవారి ఆశీస్సులతో సక్సెస్ అవుతాననే నమ్మకంతో చంద్రబాబు ఉండటమే కారణం.
ఇప్పుడు మరోసారి చంద్రబాబు తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అమరావతి అభివృద్ధికి మళ్లీ శ్రీకారం చుట్టిన చంద్రబాబు, పనుల పునఃప్రారంభానికి ముందు తిరుమల శ్రీవారిని ఆశ్రయిస్తున్నారు.

అమరావతిలోని ముళ్ల కంపలు, చెట్లు, చెదారాన్ని తొలగించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు, అభివృద్ధి పనులకు శ్రీనివాస కల్యాణంతో శుభారంభం చేయబోతున్నారు. రేపు టీటీడీ ఆధ్వర్యంలో అమరావతిలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమరావతి రైతులను టీటీడీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది.
శ్రీనివాస కల్యాణం అనంతరం ఏప్రిల్ రెండో వారంలో అమరావతి అభివృద్ధి పనులు పునఃప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక మోదీ కూడా అమరావతికి వచ్చి పనులను ప్రారంభించనున్నారు.

గతంలో కూడా చంద్రబాబు ఏ పని చేసినా ముందు శ్రీవారిని దర్శించుకుని, ఆయన ఆశీస్సులతో ముందుకు సాగేవారు. ఇప్పుడు మరోసారి శ్రీవారి సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.