మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయినా, ఉపాసన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను చూసుకుంటూనే, ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా, ఉపాసన మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది.

గర్భిణీ స్త్రీలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కీలకమైన ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. తన తాత, అపోలో ఆసుపత్రుల అధినేత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా, ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉపాసన ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ను ఉపాసన, తన మామ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి ప్రారంభించనుంది.
ఈ సందర్భంగా ఉపాసన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, “ప్రసూతి మరియు శిశు మరణాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తాం. మహిళా సాధికారత కోసం నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పిస్తాం” అని పేర్కొంది.

“మీ అందరి ఆశీర్వాదంతో ఆరోగ్యంగా, సాధికారతతో ఉన్న తల్లులు, పిల్లలను తీర్చిదిద్దేందుకు పని చేస్తాం. సుమారు వెయ్యి రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. సమాజానికి సహాయంగా ఉండటాన్ని నా బాధ్యతగా భావిస్తున్నాను. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. వారి పిల్లలు సంపూర్ణ పోషణ పొందాలి. తొలుత పిఠాపురంలో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు కృషి చేస్తాం” అని ఉపాసన తెలిపారు.