హైదరాబాద్, ఏప్రిల్ 18:
తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు కొత్త మలుపు తిప్పాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చినప్పటికీ, కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది.

2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ, సిద్ధిపేటకు చెందిన కె. పర్శరాములుతో పాటు మరో 19 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ సమాధాన పత్రాలు సరిగా మూల్యాంకించలేదని, జనరల్ ర్యాంక్ జాబితా తప్పుగా విడుదలయ్యిందని ఆరోపించారు. తీవ్రత దృష్ట్యా కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరగాలంటూ కోరారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనల్లో, హైదరాబాద్‌లోని రెండు సెంటర్ల నుంచి 71 మంది ఎంపిక కావడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. మొత్తం 563 పోస్టుల్లో ఇది 12% కి సమానమని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యలో మార్పులు, ఉర్దూ అభ్యర్థుల గణాంకాల్లో గందరగోళం, రీకౌంటింగ్‌లో మార్కుల తేడాలు వంటి అంశాలను ప్రస్తావించారు.
ఇక కమిషన్ తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదిస్తూ, ఒక్కో సెంటర్‌లో 4-5% మంది మాత్రమే ఎంపికయ్యారని, అవకతవకలు జరిగి ఉంటే ఎక్కువ మంది ఎంపిక కావాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్ కేసులో అభ్యర్థి ఫోర్జరీ చేసినట్లు తేలిందని, అతనికి షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, నియామక పత్రాలు ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ ఏప్రిల్ 28న జరగనుంది.