హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. నాంపల్లిలోని విద్యాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు.

పరీక్షలు మార్చి 5 నుండి 25 వరకు నిర్వహించగా, మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫస్ట్ ఇయర్‌కు 4.88 లక్షల మంది, సెకండ్ ఇయర్‌కు 5 లక్షలకుపైగా ఉన్నారు. 19 మూల్యాంకన కేంద్రాల్లో ఏప్రిల్ 10తో మూల్యాంకనం పూర్తైంది. ప్రతి కేంద్రంలో 600-1200 సిబ్బంది పని చేశారు.
విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా IVR నంబర్ 9240205555 ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాల అనంతరం రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అవకాశాలపై వివరాలు ప్రకటించనున్నారు. ఫెయిల్ అయిన వారికి నెలలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.