తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భయాందోళన కలిగిస్తున్నాయి. శుక్రవారం తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీల టెంపరేచర్ నమోదుకాగా, హైదరాబాద్‌లో 36.2 డిగ్రీలు నమోదు అయ్యాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, శనివారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం ఇది 43.5 డిగ్రీల వరకు చేరవచ్చని అంచనా. పలుచోట్ల వడగాలులు కూడా వచ్చే అవకాశం ఉంది. పాలకొండ, గోకవరం, ఏలేశ్వరం మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు.
ఇక చిత్తూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పిడుగులతో కూడినవిగా ఉండే అవకాశం ఉంది. ప్రజలు వేడికి, వడగాలులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.