తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విషయంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలో వివరించింది. ఈ వ్యవహారంలో త్వరితగతిన ఓ నిర్ణయానికి రావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించారు.
విభజన అనంతరం అపరిష్కృత సమస్యలు
తెలుగు రాష్ట్రాల విభజనకు దశాబ్ద కాలం అయినప్పటికీ ఆస్తులు, అప్పుల పంపకాల్లో స్పష్టత రాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై ఇరురాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో అనేక సమావేశాలు జరిగినా, తుది పరిష్కారం దొరకలేదు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన హై లెవెల్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్రం రెండు రాష్ట్రాలను పట్టువిడుపు ధోరణి అవలంబించమని హితవు పలికింది. కోర్టుకు వెళ్లినా జాప్యం తప్ప మరేమీ ఉండదని స్పష్టం చేసింది. తదుపరి సమావేశానికి షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనకు సంబంధించిన లీగల్ ఒపీనియన్‌తో రావాలని సూచించింది.
ఎక్కడ ఉంది ప్రధాన విభేదం?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తి ప్రకారం 58:42 పాళ్లలో పంచాలని నిర్ణయించారు. అయితే షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనలో ఇరురాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతోంది.
ఈ షెడ్యూళ్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఉన్నాయి. వీటిలో కొన్ని విభజన పూర్తయినా, మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (MCR-HRI), తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 20 సంస్థల విషయంలో వివాదం కొనసాగుతోంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు షీలా బెడె నేతృత్వంలోని కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అయితే ఇరురాష్ట్రాలు వాటిని అమలు చేయడం లేదు.
కేంద్రం అసహనం – తేల్చుకునే సూచనలు
వివాదాస్పద సంస్థలలో చాలా వరకు హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో వాటి స్థిరాస్తులు తెలంగాణలో ఉన్నాయి. అలాగే ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ (EAP), కార్పొరేషన్ల విభజనలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆస్తుల విషయంలో ఎక్కువ వాటా కావాలని, అప్పుల విషయంలో బాధ్యత తీసుకోలేమని ఇరురాష్ట్రాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని కేంద్రం అభిప్రాయపడింది.
ఈ పరిస్థితిని తొలగించేందుకు కేంద్ర హోంశాఖ హై లెవెల్ సమావేశంలో పట్టువిడుపులు, సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మరిన్ని జాప్యాలు లేకుండా తేల్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.