సినీ ఇండస్ట్రీకి పైరసీ తీవ్రమైన సమస్యగా మారుతోంది. కొత్త సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లీక్ అవుతుండడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ పైరసీ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రిలీజ్ అయిన మ్యాడ్ 2 పైరసీ కాపీని గుర్తించి అడ్డుకున్నామని, ఓవర్సీస్ సెన్సార్ కోసం పంపిన కాపీలు లీక్ అయ్యాయని తెలిపారు. పైరసీని కట్టడి చేయడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

పైరసీ లూప్ హోల్స్‌ను గుర్తించి ఎఫ్‌డీసీ, ప్రభుత్వ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. థియేటర్లలో మ్యాడ్ 2 హిట్‌గా కొనసాగుతున్నప్పటికీ, కొందరు దీన్ని జీర్ణించుకోలేక ఫేక్ కలెక్షన్స్ ప్రచారం చేస్తున్నారని నాగవంశీ అన్నారు. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని, కలెక్షన్స్‌పై ఎవరైనా అనుమానం ఉంటే తానే చూపిస్తానని చెప్పారు.
సినిమా ప్రమోషన్, ఓటీటీలో అమ్మడం కష్టతరమైపోతుందని నాగవంశీ తెలిపారు. కొన్ని రివ్యూలు తప్పుడు విశ్లేషణలతో ప్రేక్షకుల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయని విమర్శించారు. ప్రేక్షకులు సెకండ్ హాఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారని, కంటెంట్ లేని సినిమాలు ఆడుతున్నాయనే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.