తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ మధ్యభాగాల వరకు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. కోస్తా ఆంధ్ర తీరం మధ్య ప్రాంతం, యానం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది.

ఈ ప్రభావంతో సోమవారం, మంగళవారం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈ తరహా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్‌లో 41.3, హైదరాబాద్‌లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
నిన్న ఖమ్మం (41.8), భద్రాచలం (40.6), నిజామాబాద్ (40.5), ఆదిలాబాద్ (40.3) లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.