బాబోయ్! ఎండలు భగ్గుమంటున్నాయి. మార్చి మొదటి వారంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ చేరుకుంటున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేసింది – వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి చివరి రోజుల నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతుండటంతో, ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. ఉదయం 8:00 గంటలకు తరగతులు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాగనున్నాయి.
అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం పూట కూడా తరగతులు కొనసాగనున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ కారణంగా, ఒంటిపూట బడులను 15వ తేదీకి ముందుగానే ప్రారంభించాల్సిందిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రంజాన్ పండుగ నేపథ్యంలో తెలంగాణలోని ఉర్దూ పాఠశాలలకు ఇప్పటికే ఒంటిపూట బడులు అమలు చేయడం ప్రారంభమైంది.