సంక్రాంతి పండుగ వేళ ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, బాలకృష్ణ, కేసీఆర్ – ఇది ఖమ్మంలో సంచలనం!
సంక్రాంతి సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం ముగ్గు వేంకటాపురం గ్రామంలో ఒక రోడ్డుకి పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫ్లెక్సీలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోటో, మరోవైపు తెలంగాణ మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ ఫోటోతో పాటు, సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోటోలు ఉన్నాయి. ఇది ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఫ్లెక్సీలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల ఫోటోలను కూడా కలిపి ఉంచారు. ఇది రెండు రాష్ట్రాల రాజకీయాలను కలుపుతూ వైరల్ అవుతోంది.
అందరూ సంక్రాంతి పండుగ వేడుకలతో మునిగిపోయిన సమయంలో, ఈ ఫ్లెక్సీ స్థానిక ఎన్నికల రాజకీయాలకు కొత్త గమ్యాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ అభిమానులు చాలా మంది ఉండటంతో, ఈ ఫ్లెక్సీ పట్ల వారికి ప్రత్యేక ఆకర్షణ కలిగింది. ఇది తెలుగు తమ్ముళ్లు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న సంకేతాలుగా భావిస్తున్నారు.