తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మరియు పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూ వేగం పెంచుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రాహుల్ గాంధీ “సేవ్ కాన్‌స్టిట్యూషన్ పాదయాత్ర” (సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర) చేపట్టనున్నారు. ఈ యాత్ర తెలంగాణ నుంచి ప్రారంభమవుతుంది.
జనవరి 8న గాంధీభవన్‌లో టీపీసీసీ పిఎసి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంపై దృష్టి సారించిన ఈ యాత్రను గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి చర్చించారు.

కీలక సమావేశాలు:
రాహుల్ గాంధీ పాదయాత్ర ఏర్పాట్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలతో ఢిల్లీలో సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించారు.
టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు, ప్రజల్లో చురుకుగా పనిచేసే నాయకులకు డీసీసీ పదవుల కేటాయింపుపై కూడా చర్చించారు. పాదయాత్ర ప్రారంభానికి ఖమ్మం లేదా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.