జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడి తర్వాత కేంద్ర నిఘా సంస్థలు మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేయగా, తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పోలీసు శాఖను హై అలర్ట్ లో ఉంచుతూ, హైదరాబాద్‌లో భద్రతను బలోపేతం చేసింది.

ఇందులో భాగంగా, ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహించబోయే భారత్ సమ్మిట్-2025, అలాగే మే 7 నుంచి జరిగే మిస్ వరల్డ్-2025 పోటీలు నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొననున్నందున పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
భారత్ సమ్మిట్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు దాదాపు 100 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముంది. అలాగే మిస్ వరల్డ్-2025 పోటీలకు 140 దేశాల నుండి కంటెస్టెంట్లు రానున్నారు. దీంతో ఈవెంట్లు జరిగే హెచ్‌ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఇతరత్రా ప్రాంతాల్లోనూ భద్రతను పెంచారు. ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, పర్యాటక ప్రాంతాలు, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో పోలీసుల పటిష్ట తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఇంటెలిజెన్స్ శాఖ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ రాష్ట్ర పోలీస్ అధికారులకు కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. అనుమానాస్పదంగా కనిపించే వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని, ఉగ్రదాడులకు గురైన ప్రదేశాల్లో మరింత బలమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు గురువారం రాత్రి నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకుంటూ, హై అలర్ట్ స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.