తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి ఊగినట్లు ప్రజలు తెలిపారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనలు సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు కొనసాగాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైంది.

నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 6:56కి భూమి ఒక్కసారిగా కంపించింది. కామారెడ్డి జిల్లా టెకిర్యాల్ ప్రాంతంలో కూడా భూకంపం సంభవించడంతో భయంతో ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు, భవనాలకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయి.
ఇటీవలే రామగుండం ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న ప్రకంపనల నేపథ్యంలో మళ్లీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. రామగుండం ప్రాంతం నుంచి హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు ప్రకంపనలు చేరే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుతం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామం పరిసర ప్రాంతాన్ని జాతీయ భూకంప అధ్యయన సంస్థ (NCS) భూకంప కేంద్రంగా గుర్తించింది. భూకంపం సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.