తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఏపీ మరియు తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదని, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు సాగాలని” ఆకాంక్షించారు.
రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలు ఒకటిగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయన ప్రకారం, ఏదైనా సమస్యలు ఎదురైనా, వాటిని కలసి కూర్చుని పరిష్కరించుకోవాలని అన్నారు.
తెలుగు భాషను గౌరవిస్తూ, ప్రభుత్వం ప్రస్తుతం తెలుగు భాషలో జీవోలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్తులో తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రోత్సహించడంపై దృష్టి సారించామని చెప్పారు. ఆయన మాటలలో, “తెలుగు భాష దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష” అని గుర్తు చేస్తూ, తెలుగువారికి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర ఉన్నారని తెలిపారు.
ఇక, ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డ తెలుగువారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో, 2050 అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.