ఇదివరకూ ఎన్నిసార్లు తేదీలు అనుకున్నా.. ఫిక్స్ చేశారన్నా.. ఏదీ వాస్తవం కాలేదు. మంత్రివర్గ విస్తరణపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, తెలంగాణ రాజకీయాల్లో వాయిదాల నాటకం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యలతో ఈ అంశం మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది.

మంత్రివర్గ విస్తరణ ఎంతకాలంగా లేట్ అవుతోందో తెలిసిందే. పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఒక వేళ ఇక ఖాళీ పదవులకు నామినేషన్లు రావొచ్చంటూ భావించిన నేతలందరూ ఇప్పుడు మళ్లీ అసమాధానంతోనే ఉన్నారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా విస్తరణపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో, ఆశావహులంతా నీరసం చెందారు.
ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు — కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలో ఉందని చెప్పడం — రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటివరకు ఈ అంశం కాంగ్రెస్ అధిష్టాన పరిధిలో ఉందని చెబుతూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ఇది వ్యతిరేకంగా వినిపించింది.

ఇదిలా ఉండగా, ఖాళీ ఉన్న ఆరు మంత్రి పదవుల కోసం కొందరు సీనియర్ నేతలు ఢిల్లీకి లేఖలు రాస్తున్నారు. జానా రెడ్డి స్వయంగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లకు లేఖలు పంపారు. మల్‌రెడ్డి అయితే నేరుగా అల్టిమేటం ఇచ్చారు — మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీలో ఉండనని చెప్పారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినట్టు ప్రచారం. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా లాబీయింగ్ చేస్తున్నారని ప్రచారం ఉంది.
ఇలా ఒక్కరేంటి, చాలా మంది నేతలు ఢిల్లీ బాట పట్టారు. కొందరు విజ్ఞప్తి లేఖలు పంపించారు. అయితే ఇప్పుడు ఒకవైపు సీఎంలా, మరోవైపు ఇన్‌చార్జ్‌లా రెండు వేర్వేరు స్టేట్‌మెంట్లు రావడంతో నేతలు మరింత కన్ఫ్యూజన్‌కు లోనవుతున్నారు.
కాబట్టి ఈ విస్తరణపై క్లారిటీ రావాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే..!