ఈ వేసవిలో శరీరాన్ని చల్లబరచడం చాలా అవసరం. వేసవిలో అలసట, నీరసం, ఒంట్లో నీటి లోపం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి వేడిలో ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని సహజమైన డ్రింక్స్ ఉపశమనం కలిగిస్తాయి. ఇవి శరీరానికి తగిన పోషకాలను అందించడమే కాకుండా ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడతాయి. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం మార్కెట్‌లో లభించే గ్యాస్ కలిగిన కూల్ డ్రింక్స్, రసాయనాలు కలిగిన పానీయాల కన్నా, ఇంట్లోనే సహజమైన పదార్థాలతో తయారు చేసుకునే ఈజీ డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆరోగ్యకరమైన డ్రింక్స్ తాగడం మంచిది. ఇవి ఒంట్లో వేడిని తగ్గించడమే కాకుండా శక్తిని కూడా అందిస్తాయి.

నిమ్మకాయ – పుదీనా
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. చల్లని నీటిలో నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి కొద్దిగా ఉప్పు, తేనె కలిపి తాగితే శరీరానికి తక్షణమే చల్లదనం లభిస్తుంది. దీనిని ఐస్ క్యూబ్స్‌తో కలిపి మరింత సంతోషంగా తాగవచ్చు.
పైనాపిల్ – నిమ్మరసం
వేసవి వేడి వల్ల అలసటకు గురయ్యే వారికి పైనాపిల్ నిమ్మరసం చాలా మంచిది. నాలుగు నుంచి ఐదు పైనాపిల్ ముక్కలను నిమ్మరసంతో కలిపి బ్లెండ్ చేసి కొద్దిగా ఐస్ లేదా చల్లని నీటిని జోడించి తాగితే ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. తీపి కోసం కొద్దిగా తేనె లేదా చక్కెరను జోడించవచ్చు. ఈ డ్రింక్ అలసటను తగ్గించి శక్తిని అందిస్తుంది.
జీలకర్ర – నిమ్మకాయ
జీలకర్ర నీటిని వేడి చేసి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనికి దాల్చిన చెక్క పొడి లేదా తేనె కలిపి తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన డ్రింక్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది.
అల్లం – నిమ్మకాయ
నిమ్మకాయతో పాటు అల్లం కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసంలో దంచిన అల్లం, మెత్తగా చేసిన పుదీనా ఆకులు కలిపి కొద్దిగా నల్ల మిరియాల పొడి జోడించి తాగితే ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనికి తేనెను జోడిస్తే ఆరోగ్యపరంగా మరింత మంచిది. ఇంకా మెరుగైన ఫలితాల కోసం కొన్ని నానబెట్టిన చియా విత్తనాలను కూడా ఈ డ్రింక్ లో కలిపి తాగవచ్చు.
గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.