కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో, రీట్వీట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేశారు. ఆమె AIతో రూపొందించిన ఒక ఫొటో — జింకలు, నెమళ్లు ఉన్న రాక్ ఏరియా దృశ్యం —ను X (ట్విటర్)లో రీట్వీట్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ స్పందిస్తూ, “నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. విచారణలో పోలీసులకు సహకరించాను. నా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాను” అని తెలిపారు.
అలాగే, “నాకు పంపిన ఫోటోను నేను మాత్రమే రీట్వీట్ చేయలేదు. ఇంకా 2 వేల మంది అదే ఫొటోను రీట్వీట్ చేశారు. అయితే వారందరినీ విచారించరా..? లేక నన్నే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారా..? అని ఆమె ప్రశ్నించారు.
చట్టం అందరికీ సమానంగా ఉండాలి. లేదంటే ఇది ఎంచుకున్న వారిపైనే చర్య తీసుకోవడంగా మిగులుతుంది” అని సోషల్ మీడియా పోస్ట్లో వివరించారు.
ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్లుతుందో వేచి చూడాల్సిందే. గచ్చిబౌలి భూ వివాదం తెలంగాణలో మరోసారి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.