బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో కీలక పురోగతి సాధించారు ముంబై పోలీసులు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు బాంద్రాలోని సైఫ్ నివాసంలో జరిగింది. సైఫ్ తన కుటుంబంతో కలిసి నిద్రిస్తున్న సమయంలో దుండగుడు ఆయన చిన్న కుమారుడు జేహ్ గదిలో ప్రవేశించాడు. ఈ సమయంలో జేహ్ కేర్‌టేకర్ చూసి కేకలు వేయడంతో సైఫ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. దుండగుడు సైఫ్‌పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
సైఫ్ ఆరోగ్య పరిస్థితి:
ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యుల ప్రకారం, సైఫ్ అలీఖాన్ వెన్నెముకకు తీవ్రగాయమైంది. సర్జరీ ద్వారా వెన్నెముకలోని రెండున్నర అంగుళాల కత్తిని తొలగించారు. ఫ్లూయిడ్ లీకేజీని అరికట్టేందుకు మెజర్ సర్జరీ చేశారు. అలాగే, మెడ, ఎడమ చేతికి రెండు ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించారు. మూడు సర్జరీల తర్వాత సైఫ్‌ను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ప్రాణ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో జనరల్ వార్డుకు మార్చే అవకాశం ఉందని చెప్పారు.

పోలీసుల దర్యాప్తు:
ముంబై క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పక్కింటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. చోరీకు వచ్చిన దొంగే దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్ ఫింగర్‌ప్రింట్స్ సేకరించింది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
సంఘటనలో గాయాలైన ఇతరులు:
దాడి సమయంలో సైఫ్ ఇంట్లో పనిచేసే ఒక మహిళా సిబ్బంది కూడా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.