Happy Birthday Rohit Sharma: ఈ రోజు (ఏప్రిల్ 30) భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతని కెరీర్‌లోని కొన్ని అద్భుతమైన రికార్డులను ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ టీమిండియాకు టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను అందించాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించాడు. అతని పేరిట ఉన్న కొన్ని క్రికెట్ రికార్డులు ఇప్పటికీ అపూర్వమైనవే.

వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోరు – 264 పరుగులు – చేసి విజయవంతంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2014లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకపై 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కి ముందు మూడు నెలల పాటు వేలికి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న రోహిత్, తిరిగి వచ్చిన వెంటనే చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను 72 బంతుల్లో హాఫ్ సెంచరీ, 100 బంతుల్లో సెంచరీ, 151 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.

రోహిత్ వన్డేల్లో మొత్తం మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264, 2017లో మళ్లీ శ్రీలంకపై 208 పరుగులు చేశాడు. ఇది ప్రపంచ క్రికెట్‌లో ఒక అరుదైన ఘనత.
2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ అత్యద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం ఐదు సెంచరీలు సాధించాడు – ఇది ఒక్క వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీల రికార్డు. దక్షిణాఫ్రికాపై 122*, పాకిస్తాన్‌పై 140, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై వరుస సెంచరీలు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతను తన కెరీర్‌లో 637 సిక్సర్లు కొట్టాడు. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ (553 సిక్సర్లు) రికార్డును అతను అధిగమించాడు.
ఇంకా రోహిత్ శర్మ, షకీబ్ అల్ హసన్ – టీ20 ప్రపంచ కప్ అన్ని ఎడిషన్లలో పాల్గొన్న ఇద్దరు ఆటగాళ్లు. రోహిత్ భారత్ తరపున 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు, ఇది ప్రపంచ రికార్డు. పాల్ స్టిర్లింగ్ (145 మ్యాచులు), విరాట్ కోహ్లీ (125 మ్యాచులు) తరువాతి స్థానాల్లో ఉన్నారు. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు.
ఈ అద్భుత విజయాలు, అపూర్వమైన రికార్డులు రోహిత్ శర్మను క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి.