నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పేరు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన రేణు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలైన అకిరా నందన్, ఆధ్యకు తల్లిగా మారారు. తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నా, ప్రస్తుతం పూణేలో నివసిస్తూ తల్లి బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తండ్రిగా ఎలా ఉంటారు? పిల్లలతో ఆయన బంధం ఎలా ఉంది? అనే అంశాలపై ఆమె స్పందించారు.
ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగిన తనయుడు అకిరా, పవన్ కళ్యాణ్ తో కలిసి కుంభమేళాకు వెళ్ళాలని తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. అప్పట్లో వారణాసి వంటి పురాతన ధార్మిక స్థలాలకు వెళ్లిన అనుభవం వల్లే అకిరాలో ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరిగిందని చెప్పారు. అప్పుడే తనయుడికి “నాన్నతో కలిసి వెళ్ళు, నీ ప్రయాణం అలా సాఫీగా ఉంటుంది” అని చెప్పిన విషయాన్ని షేర్ చేసింది.
పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడు, కేరళలోని ఆలయాలను సందర్శించగా, అకిరా కూడా వెళ్లాలనగా “వెళ్లు” అని తాను ప్రోత్సహించానని తెలిపింది. “పవన్ ఒక మంచి తండ్రి. పిల్లల పట్ల ఎంతో ప్రేమగా, కేర్‌తో ఉంటారు. అలాంటి తండ్రితో పిల్లలు కలిసి ఉండాలనుకోవడంలో తప్పేంటి?” అంటూ రేణు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంతేకాదు, తన భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటే బీజేపీలోనే చేరుతానని కూడా ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎందుకంటే బీజేపీపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు.