భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ వచ్చింది. రేణిగుంట – కాట్పాడి రైల్వే మార్గాన్ని డబుల్ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 1,332 కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఈ డబ్లింగ్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు భారీ లాభాలు చేకూరుతాయని ఆయన పేర్కొన్నారు. దూరం తక్కువ అయినప్పటికీ ఈ మార్గం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా మంత్రి వివరించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలు, తమిళనాడులోని వెల్లూరు వరకు ప్రయాణించే వారికి ఇది కీలక మార్గమవుతుంది.
ఈ ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధి, పారిశ్రామిక రంగాలకు గణనీయంగా తోడ్పడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. తిరుపతి – పాకాల – కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రెండూ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా మారనుంది.