డైరెక్టర్ ఆర్జీవీకి మరో షాక్ – మరో కేసులో నోటీసులు
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)కి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో ఆయన ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 7న రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్జీవీని విచారించారు. విచారణలో మొత్తం 50 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు “తనకు గుర్తు లేదని, తెలియదని” ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
రామ్ గోపాల్ వర్మ స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. ఆయనకు మరొకసారి విచారణకు హాజరుకావాలని సూచించారు. విచారణ పూర్తయ్యాక ఆర్జీవీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారు.
ఆర్జీవీకి గుంటూరు నుంచి మరో షాక్
ఇంతలోనే గుంటూరు పోలీసులు మరోసారి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. 2019లో విడుదలైన “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా కొన్ని సన్నివేశాలు మనోభావాలను దెబ్బతీశాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు నవంబర్ 29న సీఐడీ కార్యాలయంలో కేసు నమోదు చేశారు. తాజాగా, గుంటూరు సీఐ తిరుమలరావు మరోసారి ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ నోటీసులను అందజేశారు. ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆర్జీవీ రియాక్షన్ – “ఒంగోలు అంటే నాకు చాలా ఇష్టం”
ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ ముగిసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
“నాకు ఒంగోలు అంటే చాలా ఇష్టం.. ఒంగోలు పోలీసులు అంతకన్నా ఇష్టం.. ఛీర్స్!” అంటూ వైన్ గ్లాసుల ఎమోజీలు జతచేశారు.
ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేశ్ మార్ఫింగ్ ఫొటో కేసు వివాదంగా మారింది. ఇప్పుడు “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” కేసు కొత్త మలుపు తిరగనుంది. చూడాలి, ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో!