ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించి అనంతపురం తరలించారు.

పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు రెచ్చగొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. బుధవారం రాత్రి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
గత కొంతకాలంగా పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, పార్టీ ఓటమి తర్వాత ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.