తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సర్వత్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటన స్థలాన్ని సందర్శించి, “ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు?” అని టీటీడీ ఈవో, ఇతర అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి తిరుపతికి బయలుదేరారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించనున్నారు. ఇతర బాధితులను కలుసుకోనున్నారు.

ఈ ఘటన వివరాల ప్రకారం, తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రం వద్ద, రాత్రి సమయంలో అస్వస్థతకు గురైన వ్యక్తిని తరలించేందుకు పార్కు గేట్లు తెరిచారు. దీంతో, పెద్ద సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా గేట్ల వైపు పరుగెత్తడం, కొంతమంది తొక్కిసలాటలో చిక్కుకోవడం కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, స్థానిక అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.