పరీక్షా పే చర్చలో దీపికా పదుకొణె – మానసిక ఆరోగ్యంపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ ఈసారి మరింత ప్రత్యేకంగా జరిగింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఇందులో పాల్గొని విద్యార్థులతో మానసిక ఆరోగ్యంపై తన అనుభవాలనుపంచు కున్నారు.

దీపికా తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, కుంగుబాటు గురించి వివరంగా చెప్పింది. 2014 తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్ బాధను అనుభవించానని, ఆ సమయంలో సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయని వెల్లడించింది. ముంబయిలో ఒంటరిగా ఉండటంతో తన మనోస్థితి మరింత దిగజారిందని దీపిక తెలిపారు.
తన బాధను మొదటిసారి తన తల్లితో పంచుకున్నానని, ఆ సందర్భంలో తాను బతకాలని కూడా అనుకోలేదని చెప్పడంతో, తల్లి వెంటనే సైకాలజిస్ట్‌ను సంప్రదించినట్లు గుర్తుచేసుకుంది.
మానసిక ఆరోగ్యం కోసం దీపిక సూచనలు:
- ఒత్తిడిని ఎదుర్కొనడం సహజమే, దాన్ని భయపడాల్సిన అవసరం లేదు.
- మానసిక ఆరోగ్య సమస్యలను ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ బాధ తగ్గుతుంది.
- సమస్యను ఒంటరిగా ఎదుర్కొని మరింత బాధపడకూడదు.
- అవసరమైతే సైకాలజిస్ట్ లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి.
విద్యార్థులు చదువు ఒత్తిడి, మానసిక క్షోభను సమర్థంగా ఎదుర్కొనేలా దీపిక తన అనుభవాలను షేర్ చేసుకోవడం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా మారింది.