జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దారుణ ఘటనలో 28 మంది అమాయక పర్యాటకులు మృతి చెందారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ముష్కరులు పర్యాటకులపై కాల్పులు జరిపి అనంతరం అడవుల్లోకి పారిపోయారు. దాడి తర్వాత భద్రతా బలగాలు వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జమ్మూ కశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. వీరిలో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందినవారని గుర్తించారు. వారి పేర్లు ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హషీమ్ ముసాలు అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ముగ్గురూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారని సమాచారం.
ఈ ఉగ్రవాదులపై సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల బహుమతి ప్రకటించామని అనంత్‌నాగ్ జిల్లా పోలీసులు వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను పూర్తి గోప్యతతో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదుల సమాచారం కోసం అనంత్‌నాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు పీసీఆర్ కాంటాక్ట్ నంబర్లు ప్రకటించారు.
దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యంగా మారాలని పోలీసులు కోరుతున్నారు.