ఏపీ రాష్ట్రంలో మందుల దుకాణాల పేరుతో పెద్ద మాఫియా నడుస్తోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు అధికారులు ఆపరేషన్ గరుడ పేరుతో భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈగల్ టీమ్స్, పోలీస్, మెడికల్ అధికారులు కలిసి రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలను తనిఖీ చేశారు. మొత్తం 100 ప్రత్యేక టీమ్‌లు ఈ ఆపరేషన్‌లో పాల్గొని, నిషేధిత మందుల సరఫరా, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టాయి.

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకం
ఈ తనిఖీల్లో చాలా మెడికల్ షాపులు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇకపై ఈ అక్రమ విక్రయాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న మందులు మాత్రమే విక్రయించాలని, NRX డ్రగ్స్ అనుమతి లేకుండా అమ్మకూడదని స్పష్టంగా చెప్పారు.
అనుమతుల్లేని మెడికల్ షాపులు
తనిఖీల్లో కొన్ని మెడికల్ షాపులకు అనుమతులు లేకపోవడం, కొన్ని షాపుల్లో లైసెన్స్ ఒకరిదైనా, నిర్వహణ మరొకరు చేస్తున్న విషయం బయటపడింది. బీ ఫార్మసీ చదివిన వారు లేకుండా అనధికారికంగా మెడికల్ షాపులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని లైసెన్స్ పొందుతున్నట్టు నిర్ధారణ అయింది.
మెడికల్ మాఫియాపై నిఘా
మందుల కంపెనీలు ఇచ్చే కమీషన్ల ప్రలోభాలకు చిక్కి రోగులకు అవసరం లేని మందులను వైద్యులు సూచిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. రోగికి అవసరం కాని మందులను పెద్ద ఎత్తున అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అనుమతిలేని షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇలా మెడికల్ మాఫియాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ తనిఖీలు కొనసాగుతాయని, అక్రమంగా మందుల వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.















