తెలుగులో బిగ్ బాస్ అనే రియాల్టీ షోకు దేశవ్యాప్తంగా అభిమానులుండగా, ఈ షోను తొలి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌లో న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే, అప్పట్లో నాని యాంకరింగ్ పై విమర్శలొచ్చినా, ఆయన తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు త్వరలో రాబోయే బిగ్ బాస్ సీజన్ 9లో హోస్ట్ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది. నాగార్జున తప్పుకుంటున్నారనే వార్తల మధ్య విజయ్ దేవరకొండ, రానా, బాలకృష్ణ, నాని లాంటి పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా నాని ఈ రూమర్లపై స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “బిగ్ బాస్ షో నన్ను బలంగా మార్చింది కానీ అది నా జీవితంలో ముగిసిన అధ్యాయం. మళ్లీ హోస్ట్ చేసే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని అప్పుడే స్పష్టంగా చెప్పాను” అని తేల్చిచెప్పాడు. “ఒక గేమ్ షో అనుకున్నా, కానీ ఆ షో వెనుక ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. బయట ప్రపంచాన్ని కొత్తగా చూపించింది. మళ్లీ ఆ దిశగా వెళ్లను” అంటూ క్లారిటీ ఇచ్చాడు.