మొదటి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా.. హీరో, రెమ్యునరేషన్ వివరాలు ఇవే!
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో వెలుగులోకి వచ్చిన వారిలో మోనాలిసా భోంస్లే ఒకరు. తన డస్కీ స్కిన్, తేనె కళ్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో మోనాలిసా తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. అయితే కొందరు యూట్యూబర్లు ఆమె ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే మోనాలిసా సోషల్ మీడియా స్టార్‌గా మారింది.
ఈ వైరల్ ఫేమ్ మోనాలిసాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు తన సినిమా ద్వారా అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. తాజాగా, ఆయన మాటను నిలబెట్టుకుంటూ, మోనాలిసా ఇంటికి వెళ్లి ఆమె తండ్రి జై సింగ్ భోంస్లేతో చర్చించారు. సినిమా పరిశ్రమ గురించి వివరించి, అన్ని సందేహాలను నివృత్తి చేశారు. చివరికి మోనాలిసా తండ్రి కూడా తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు.
సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో మోనాలిసా నటించనుంది. ఇందులో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురిగా కనిపించనుందని సమాచారం. దాదాపు ₹20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగ్రేటం చేయనున్నారు.
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా, ఏప్రిల్ నుంచి మోనాలిసా షూటింగ్‌లో పాల్గొననుంది. అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.