తెలుగు సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మోహన్ బాబు 2019లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై తిరుపతిలో ధర్నా నిర్వహించారు. మదనపల్లె హైవేపై ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్, విద్యార్థులతో కలిసి బైఠాయించారు. కానీ అప్పటికే దేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) అమలులో ఉండటంతో చంద్రగిరి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. రహదారి నిర్బంధం, కోడ్ ఉల్లంఘన, పోలీసుల అనుమతి లేకుండా ధర్నా జరపడం వంటి అభియోగాలు ఉన్నాయి.

ఈ కేసును నిలిపివేయాలని మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పైగా మే 2న ఆయన కోర్టులో తప్పకుండా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశం జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. మోహన్ బాబు తరపు న్యాయవాది, ఆయన 75 ఏళ్ల వ్యక్తి అని, ప్రైవేట్ వ్యక్తులపై MCC వర్తించదని వాదించినా, కోర్టు అంగీకరించలేదు. ధర్నా చేస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందే కేసు వస్తుందని స్పష్టం చేసింది.
మోహన్ బాబు ప్రకారం, 2014-2019 మధ్య ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యాసంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. సిబ్బందికి జీతాలు చెల్లించడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ఇటువంటి సమస్యలు లేవని, కానీ తర్వాతి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని అన్నారు.