ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలలో ఒకటైన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలు హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. ఇది 72వ ఎడిషన్. ఈ నెల 10వ తేదీ నుంచి 31 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ సమగ్ర ఏర్పాట్లలో మునిగిపోయింది.

ఈ పోటీల్లో 120 దేశాల నుండి బ్యూటీ క్వీన్స్ పాల్గొంటున్నారు. ఇప్పటికే మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సెన్ వాన్ రెన్స్ బర్గ్, మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేంద్రియుజ్ పెడ్రోసో, మిస్ కెనడా ఎమ్మా డయన్నా క్యాథరిన్ మొర్రిసన్లు హైదరాబాద్కి చేరుకున్నారు. అంతేకాదు, మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లీ కూడా ఇప్పటికే నగరంలో ఉన్నారు. ఆమె తెలంగాణ ప్రభుత్వ అధికారులతో ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్నారు.
ఈరోజు (సోమవారం) మరో ముగ్గురు కంటెస్టెంట్లు – పోర్చుగల్ నుంచి మారియా అమెలియా ఆంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా పోకుహా అడ్డో, ఐర్లాండ్ నుంచి జాస్మిన్ హైదరాబాద్కి రానున్నారు. వీరికి సంప్రదాయ లాంఛనాలతో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
హైదరాబాద్ నగరం ఇప్పుడు గ్లోబల్ దృష్టిని ఆకర్షిస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్, సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు, తెలంగాణ పర్యాటక అభివృద్ధికి పెద్ద వేదికగా మారనుంది.