తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 7 నుంచి 31 వరకు సాగనున్న ఈ కార్యక్రమానికి 120 దేశాలకు చెందిన యువతులు హాజరవుతారు. ఈ పోటీలు నగర అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం ప్రదర్శనకు వేదిక కావడం విశేషం.

ఈ క్రమంలో మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్‌పర్సన్ అయిన జూలియా ఈవేలిన్ మోర్లీ శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం లభించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన జూలియా మోర్లీ – “తెలంగాణ ప్రభుత్వంతో మేము కలసి పని చేయడం గర్వంగా ఉంది. ఈ రాష్ట్రంలోని అద్భుతమైన వారసత్వాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఇది గొప్ప అవకాశం” అని తెలిపారు.
రేపటి నుంచే మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను ఆమె స్వయంగా సమీక్షించనున్నారు. మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించబోయే ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. వివిధ ఈవెంట్లపై సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురానున్న ఈ ఈవెంట్‌కు సంబంధించి అధికారులు, టూరిజం డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లను శ్రద్ధతో చేపట్టాయి.