మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు ఆగడంలేదు. పెదరాయుడి ఇంటిలో కాసేపు ప్రశాంతత నెలకొన్నట్టే అనిపించగా, మళ్లీ గొడవలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆస్తుల పంపకాల విషయంలో తీవ్ర వివాదాలు ఉధృతం కాగా, ఇప్పుడు కార్ల వివాదం చర్చనీయాంశమవుతోంది. మంచు మనోజ్ తాజాగా హైదరాబాద్ నార్సింగి పోలీసులకు అన్న మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు.

తాను రాజస్థాన్‌లో కూతురు పుట్టినరోజు వేడుకల కోసం ఉన్న సమయంలో, తన ఇంటిలోకి 150 మంది ప్రవేశించి విలువైన వస్తువులు, కార్లను తీసుకెళ్లారంటూ మనోజ్ పోలీసులకు తెలిపారు. కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయని ఆధారాలు సమర్పించారు. గోడలు దూకి కొన్ని వస్తువులను ధ్వంసం చేశారని, తండ్రి మోహన్‌బాబును సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందనలేదన్నారు. విష్ణుపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరారు.
ఇప్పటికే మోహన్‌బాబు, విష్ణుపై మనోజ్ పలుమార్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులైతే ఇద్దరు వర్గాలకూ వార్నింగ్ ఇచ్చారు. అయితే వివాదాలు మళ్లీ ప్రారంభమవడం ఆశ్చర్యకరం. విష్ణు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.