మంచు ఫ్యామిలీలో ఉన్న విభేదాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. మంచు మనోజ్ దంపతులు, శ్రీ విద్యానికేతన్ దగ్గర జరిగిన ఉద్రిక్తతలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం (జనవరి 15), మంచు మనోజ్ దంపతులు మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది.
సెక్యూరిటీ స్టాఫ్ వాదన ప్రకారం, కోర్టు ఉత్తర్వుల కారణంగా వారిని లోపలికి అనుమతించలేమని తెలిపారు. ఈ సందర్భంగా గేటు తెరవమని కోరుతూ, మంచు మనోజ్ దంపతులు విశ్వవిద్యాలయం ఎదుట నిరీక్షించారు. ఈ దృశ్యాలను చూసి అక్కడికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పరిణామాలు మరింత ఉత్కంఠభరితంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.

ఈ ఘటనపై మంచు మనోజ్ మాట్లాడుతూ, యూనివర్సిటీకి వస్తున్న విషయాన్ని తెలుసుకుని కొంతమంది బౌన్సర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. అయినప్పటికీ, తాను కేవలం పోలీసుల మాట విని అక్కడి నుంచి వెళ్లిపోయానని స్పష్టం చేశారు.
తాజాగా, శ్రీ విద్యానికేతన్ దగ్గర తమను కాలేజీలోకి అనుమతించకపోవడంపై పూర్తి వివరాలను ఫిర్యాదుగా చంద్రగిరి పోలీసులకు అందజేశారు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.