మాజీ మంత్రి విడుదల రజినీకి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విడుదల రజినీ ఏం చేశారు? హైకోర్టు కేసు నమోదు చేయమని ఎందుకు ఆదేశించాల్సి వచ్చింది? ఆమెకు వ్యతిరేకంగా ఎవరు కోర్టును ఆశ్రయించారు? ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజినీపై రెండు వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దర్యాప్తు జరిపి నిజానిజాలను తేల్చాల్సిందిగా స్పష్టం చేసింది. చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, రజినీపై కేసు నమోదుకు ఆదేశాలివ్వడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.

పిల్లి కోటి తన పిటిషన్‌లో మాట్లాడుతూ, తాను అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నానని, పోలీసుల ద్వారా తనపై దాడి చేయించారని ఆరోపించాడు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై విడుదల రజినీ ఎన్నో వేధింపులు చేపట్టిందని తెలిపాడు. తనపై చిత్రహింసలు సాగించిన దృశ్యాలను విడుదల రజినీ లైవ్ చూస్తూ ఆనందించారని, టీడీపీ కోసం పనిచేస్తే చంపేస్తామని బెదిరించారని కోర్టుకు వివరించాడు. అంతేకాదు, విడుదల రజనీతో పాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణీంద్ర, అప్పటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావును అప్పట్లో కోరినప్పటికీ, పోలీసులు స్పందించలేదని పేర్కొన్నాడు.
అయితే, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు పిల్లి కోటి వెల్లడించాడు. కోర్టు విచారణ అనంతరం, వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను స్వీకరించిన పిల్లి కోటి, వాటితో ఎస్పీ శ్రీనివాసరావును మరోసారి కలిశాడు. ఎస్పీ ఈ కేసుపై న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో విడుదల రజినీ ఎలా స్పందిస్తారు? పోలీసులు కేసు నమోదు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ అంశం రాజకీయంగా మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరి, ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి!