టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్‌లపై ఇటీవల ఈడీ చేసిన సోదాల నేపథ్యంలో, ఈ విచారణ మొదలైంది. మహేష్ బాబు ఈ నెల 27న ఈడీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించబడినట్లు తెలుస్తోంది.

సాయి సూర్య డెవలపర్స్ తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ప్రచారం చేసినందుకు మహేష్ బాబుకు మొత్తం రూ. 5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ. 3.4 కోట్లు బ్యాంక్ చెక్కుల ద్వారా, మిగిలిన రూ. 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించబడినట్లు సమాచారం. ఈ నగదు లావాదేవీలపై ఈడీ విచారణ చేపట్టింది.
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె. సతీష్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానాలపై అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు అమ్మడం, ఒకే ప్లాటును పలువురికి విక్రయించడం, తప్పుడు హామీలతో మోసం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
మహేష్ బాబు చేసిన ప్రచారంతో ప్రజలు ఆ సంస్థలపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే ఆయనకు సంస్థ మోసపూరిత కార్యకలాపాల గురించి తెలియదని ఈడీ అనుకుంటోంది. మహేష్ నేరుగా ఈ కుంభకోణంలో పాలుపంచుకోకపోయినా, ఆయనకు చెల్లించిన మొత్తంపై ఈడీ విచారణ కొనసాగిస్తోంది.
ఇక ఈ నెల 16న ఈడీ అధికారులు సాయి సూర్య మరియు సురానా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, నగదు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థలు రూ. 100 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు అనుమానం. ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులకు డబ్బులు చెల్లించిన విషయమూ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.