శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమలో సంచలనాత్మక చోరీ వెలుగులోకి వచ్చింది. పరిశ్రమలో ఉంచిన సుమారు 900 కారు ఇంజిన్లు అదృశ్యమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాతే ఈ విషయం బయటకు వచ్చింది. కేసు తీవ్రతను బట్టి పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును విచారిస్తోంది.
కియా సంస్థకు అవసరమైన విడిభాగాలు వివిధ ప్రాంతాల నుండి సరఫరా అవుతుంటాయి. ఇందులో భాగంగా, కారు ఇంజిన్లు ప్రధానంగా తమిళనాడు నుండి కంటైనర్ల ద్వారా వస్తాయి. ఈ ట్రాన్స్‌పోర్ట్ ప్రక్రియలో ఎక్కడైనా చోరీ జరిగిందా? లేదా పరిశ్రమకు వచ్చాకే ఈ దొంగతనమా? అనే కోణాల్లో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు ప్రస్తుతం తుదిదశకు చేరిందని సమాచారం. త్వరలోనే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.