హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి పరిపాలనలో విఫలమైందని విమర్శించారు. భూముల రేట్లు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

గులాబీ జెండా ఎగరేసిన 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, ఉద్యమ కాలం నుంచి ఇప్పుడు వరకు ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వరాష్ట్ర సాధనలో తమ పోరాటాన్ని వివరించారు. రైతు బంధు, దళితబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో తెలంగాణ రూపురేఖలు మార్చామని తెలిపారు.
కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో గోసలు పడ్డారని, ఇప్పటికీ అదే వైనమని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం భూములు అమ్మొచ్చుకాని, యూనివర్సిటీ భూములు అమ్మడం తప్పని విమర్శించారు.
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర బీజేపీ పాలనపై కూడా కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, యువతను ఉచ్చు కోస్తున్నారని విమర్శిస్తూ, నక్సలైట్లను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. రజతోత్సవ వేదికగా ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపాలని పిలుపునిచ్చారు.