ఈ కాలంలో టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లు ఎక్కువగా చూసే అలవాటు వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటోంది. శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం కనుక కళ్ళను రక్షించుకోవడం చాలా ముఖ్యం. కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు రెటీనాకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యం గురించిన సంకేతాలనూ ఇస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి జీవనశైలిలో మార్పులు తెచ్చుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం అవసరం.

కంటి ఆరోగ్యానికి అవసరమైన ముఖ్య పోషకాలలో విటమిన్లు A, C, E, జింక్, ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు ముఖ్యమైనవి. విటమిన్ A మాంసం, చేప నూనె, గుడ్లు, పాలకూర, క్యారెట్లలో లభిస్తుంది. విటమిన్ C నారింజ, కివీ, స్ట్రాబెర్రీలు, టమోటాల్లో ఉంటుంది. విటమిన్ E బాదం, వేరుశెనగ, ఆలివ్ నూనెలో లభిస్తుంది. తాజా కూరగాయలు రోజువారీ ఆహారంలో భాగం చేయాలి.

పటిష్టమైన కంటి ఆరోగ్యానికి:
- స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడకుండా ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరం చూడాలి.
- మితంగా వ్యాయామం చేయాలి.
- UV కిరణాల నుండి కళ్ళను కాపాడాలి.
- ధూమపానం మానేయాలి.
- క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
ఇవి పాటిస్తే కంటి ఆరోగ్యం బాగుండి, దీర్ఘకాలంలో కూడా దృష్టి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.