కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. “స్టేటస్ కో” కొనసాగించాలని స్పష్టంగా పేర్కొన్న ధర్మాసనం, తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. చెట్ల నరికి వేయడంపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? సూటిగా చెప్పండి,” అంటూ ప్రశ్నించింది. నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో వివరించ, అధికారుల కోసం తాత్కాలిక జైలు చెరువు దగ్గర ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం చేసింది.

పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ అనేది లేదని కోర్టు తేల్చేసింది. 1996 తీర్పును ఉల్లంఘిస్తూ మినహాయింపులు ఇచ్చిన అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రైవేట్ ఫారెస్ట్ అయినా చెట్ల నరికివేతను ఉపేక్షించబోమని కోర్టు స్పష్టం చేసింది. బుల్డోజర్లతో వంద ఎకరాలు తుడిచేస్తే సరిపోదు; అవసరమైన అనుమతులు తప్పనిసరి అన్నది కోర్టు స్పష్టత.
రాష్ట్ర తరఫున లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ, “ప్రస్తుతం అన్ని పనులు నిలిపేశాం, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం,” అన్నారు. అయితే అమికస్ క్యూరీ మాత్రం, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగా అనుమతులు పొందడమంతా సుప్రీం తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న విషయాన్ని కూడా వివరించారు. ఈ కేసులో సీఈసీ నివేదికపై రాష్ట్రానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది ధర్మాసనం.