మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు వేగం పెంచారు. ఇటీవల చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలో కలిసింది. ఈ సమావేశానికి నటుడు, నిర్మాత మోహన్ బాబు నేతృత్వం వహించగా, విష్ణు మంచు, ప్రభుదేవా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం యోగికి భక్త కన్నప్ప పురాణ కథాంశం, సినిమా నేపథ్యం వివరించారు. ముఖ్యమంత్రి సమక్షంలో కన్నప్ప చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. మరోవైపు, సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్మాణానికి సంబంధించిన చిన్న వీడియోను కూడా సీఎం యోగికి చూపించారు. భక్తి, భారతీయ సంస్కృతి నేపథ్యాన్ని ప్రతిబింబించేలా సినిమాను అత్యంత నిబద్ధతతో తెరకెక్కించినట్లు వివరించారు. వీడియో చూసిన యోగి ఆదిత్యనాథ్ చిత్రబృంద ప్రయత్నాలను అభినందించారు. పురాణ కథలు, భక్తి సంప్రదాయాలను సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పారు.
ఇందులో మోహన్ బాబు ముఖ్యమంత్రిని సినిమా ఒకసారి చూడమని కోరగా, తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం సందర్శించాలంటూ ఆహ్వానించారు.