42 ఏళ్ల తర్వాత మహత్తర ఘట్టం: కాళేశ్వరంలో మూడు రోజుల పాటు మహా కుంభాభిషేకం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలసిన కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి ఆలయంలో సుమారు 42 సంవత్సరాల తర్వాత మహా కుంభాభిషేకం ఘనంగా జరుగుతోంది. ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ మహోత్తర ఘట్టం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.

ఈ పవిత్ర మహోత్సవం కోసం ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
విశేష కార్యక్రమాలు:
- ఫిబ్రవరి 7 (శుక్రవారం):
- మంగళ వాయిద్యాల నడుమ గణపతి పూజ, గోపూజ, పున్నవచనము, రక్షాబంధనం
- మధ్యాహ్నం 12:00 వరకు దేవతాస్థాపన, హోమాలు, చండీ పారాయణం
- సాయంత్రం 3:30 నుంచి 6:00 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు
- ఫిబ్రవరి 8 (శనివారం):
- ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ప్రాతఃకాల పూజలు, మహా రుద్రాభిషేకం
- సాయంత్రం 6:30 వరకు హారతి, తీర్థ ప్రసాద వితరణ
- ఫిబ్రవరి 9 (ఆదివారం):
- ఉదయం 7:30 నుంచి 10:00 వరకు రుద్ర వాహనం, జయాధులు, మహా పూర్ణాహుతి
- 10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, ఆశీర్వచనం
- వేద పండితులు, ప్రధాన అర్చకులు ఆలయ గోపురం పైకి ఎక్కి అభిషేకాలు నిర్వహణ
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ మూడు రోజుల పాటు కుంభాభిషేకం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించేలా వీలైనన్ని ఏర్పాట్లు చేపట్టారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో నిర్వాహకులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
42 ఏళ్ల తర్వాత నిర్వహించబడుతున్న ఈ మహోత్తర ఘట్టాన్ని భక్తులు తిలకించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.