మూడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే పార్టీ వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. “రాష్ట్రాన్ని మేమే పాలిస్తాం” అంటూ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. జగన్ 2.0 పాలన పూర్తిగా కొత్తగా ఉంటుందని, చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలిచిన నాయకులతో భేటీ అయిన జగన్, పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. “కష్టకాలంలో మీరు చూపించిన నిబద్ధతకు పార్టీ రుణపడి ఉంటుంది” అంటూ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
“మూడు సంవత్సరాలు కళ్లుమూసుకుంటే గడిచిపోతాయి. ఆ తర్వాత వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది” అని తెలిపారు. జగన్ 1.0తో పోలిస్తే జగన్ 2.0 పాలన గట్టిగా ఉంటుంది అన్నారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి అని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్, “సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎగ్గొట్టేందుకు అప్పులపై అబద్ధాలు చెబుతున్నారు” అన్నారు. చంద్రబాబు పాలనలో మోసాలే కనిపిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. “సంఖ్యాబలం లేకున్నా పోటీ చేసి, మా నాయకులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు” అని ఆరోపించారు.
“పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూశారు” అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు. రాబోయే రోజులు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.