ఈ మధ్యకాలంలో టెలివిజన్ డాన్స్ షోలు మరీ హద్దులు దాటి పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్లాసిక్ పాటల పట్ల గౌరవం లేకుండా స్టంట్స్, హాట్ మువ్‌లు వేయడం నెటిజన్ల ఆగ్రహానికి దారితీస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్ కాన్సెప్ట్ ఉన్న పాటలపై కూడా కేవలం వినోదం కోసమే అర్థం లేని డ్యాన్స్‌లు చేయడం, అసభ్యమైన దుస్తుల్లో ప్రదర్శనలు ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది.

తాజాగా ఓ పాపులర్ డాన్స్ షోలో ‘ఆహా నా పెళ్లి అంట’ అనే సావిత్రి గారు చేసిన ఐకానిక్ సాంగ్‌ను ఆధారంగా తీసుకుని, బెల్లీ డ్యాన్స్ స్టెప్పులు వేసి పాట స్వరూపాన్ని దెబ్బతీశారన్న విమర్శలు వచ్చాయి. ఆ సీన్‌లో ఆర్టిస్ట్ వేసిన పొట్టి డ్రెస్, డ్యాన్స్ స్టైల్ చూసి ప్రేక్షకులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే షోకు గెస్ట్‌గా హాజరైన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాత్రం ఆ పర్ఫామెన్స్‌ను ‘కొత్తగా ఉందని’ అభినందించడం మరో వివాదానికి దారి తీసింది. దాంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తన సినిమాప్రమోషన్స్‌లో ఈ వ్యవహారంపై స్పందించారు.

“అలాంటి టీవీ షోలకు వెళ్ళినప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు తెలిపే స్వేచ్ఛ చాలా వరకు ఉండదు. వాళ్లు శ్రమించి చేసిన డ్యాన్స్‌ను చూసి అభినందించాల్సి వస్తుంది. ఆ అమ్మాయి నిజంగా కష్టపడి పెర్ఫార్మ్ చేసింది. కానీ ఆ పాటకు అలాంటి డ్యాన్స్ సరిపోదు అనిపించింది. నా అభిప్రాయాన్ని అక్కడ చెబితే, ఎడిటింగ్‌లో మరో విధంగా చూపించే ప్రమాదం ఉంది. పైగా నాకు బెల్లీ డ్యాన్స్ అంటే ఇష్టమే… కానీ ఇది కాంటెక్స్ట్‌కి సరిపోలేదు,” అని ఇంద్రగంటి స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో, గతంలోనూ తాను నవ్విన దాన్ని తప్పుగా ఎడిట్ చేసి వివాదం చేసిన సందర్భం గుర్తుచేసుకున్నారు. “ఇలాంటి షోలలో పాల్గొన్నప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా తప్పుగా చూపించే అవకాశం ఉంది,” అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన సారంగపాణి జాతకం అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.