హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా మామూలుగా కొనసాగేందుకు, నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ పేరుతో ఏప్రిల్ 15 నుండి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. ఈ డ్రైవ్‌లో నల్లాలకు మోటార్లు అమర్చి నీటిని తోడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఈ స్పెషల్ డ్రైవ్‌లో కీలకంగా చేపట్టనున్న చర్యలు:
- నల్లాలకు మోటార్ బిగించి నీటిని తోడితే ఐదువేల రూపాయల జరిమానా విధించి, సంబంధిత కనెక్షన్‌ను తాత్కాలికంగా కట్ చేయనున్నారు.
- లైన్‌మెన్ నుండి ఎండీ వరకూ అధికారులు ఫీల్డ్‌లోకి వచ్చి తనిఖీలు నిర్వహిస్తారు.
- నీటిని వృథా చేస్తూ వాహనాలు కడగడం, గార్డెనింగ్, ఓవర్ ఫ్లోలు, నిర్మాణ పనులకు వాడితే కూడా చర్యలు ఉంటాయి.
- నలుగురు అధికారులు సంబంధిత స్టేజుల్లో తనిఖీలు చేసి నివేదికలు అందించాలి.
తనిఖీలు నాలుగు దశల్లో జరగనున్నాయి:
- లైన్‌మెన్ పరిశీలన – కనెక్షన్ టూ కనెక్షన్‌గా నీటి ఒత్తిడి, మోటార్ వాడకం తెలుసుకుంటారు.
- సెక్షన్ మేనేజర్ తనిఖీ – మోటార్ బిగింపు గుర్తిస్తే రూ.5000 జరిమానా విధించి, మోటర్‌ను సీజ్ చేస్తారు.
- జీఎం స్థాయి పరిశీలన – నివేదికలు పరిశీలించి సంతృప్తికరంగా ఉంటే పై అధికారులకు నివేదిక.
- సీనియర్ అధికారుల చెక్ – సీజీఎం, డైరెక్టర్, ఎండీలు ర్యాండమ్ తనిఖీలు చేస్తారు. తప్పుడు నివేదికలిస్తే అధికారులపై చర్యలు ఉంటాయి.
మొబైల్ యాప్‌తో తాజా పర్యవేక్షణ:
- అక్రమ మోటార్లను, నీటి వృథాను గుర్తించి ఫోటోతో యాప్‌లో అప్లోడ్ చేయొచ్చు.
- కన్స్యూమర్ నెంబర్ ఆధారంగా పెనాల్టీ బిల్‌లో జమ చేయబడుతుంది.
- మొదటి దశలో అధికారులకు మాత్రమే యాప్‌ను అందుబాటులో ఉంచుతారు.
- రెండో దశలో ప్రజలు వాలంటీర్‌గా ఫిర్యాదులు ఇవ్వగలుగుతారు.
జలమండలి విజ్ఞప్తి: వేసవిలో నీటి కొరత నివారించేందుకు శుద్ధి చేసిన నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించమని జలమండలి సూచించింది. శుద్ధి చేయబడిన నీరు వ్యర్థంగా పోకుండా అందరూ జాగ్రత్తగా వినియోగించాలని కోరారు.