ఆరోగ్యంగా జీవించాలంటే స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరం. అయితే, సిటీల్లో నూటికి నూరుపాళ్లు స్వచ్ఛమైన గాలి దొరకడం చాలా కష్టం. దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోతే..! ఊహకే గుండె దడదడలాడుతుంది కదా! ప్రస్తుతం హైదరాబాద్‌లో గాలి నాణ్యత అలాగే ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాయు నాణ్యత అత్యంత దారుణంగా పడిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే అక్కడి తీవ్రమైన వాయు కాలుష్యమే గుర్తుకువస్తుంది. ప్రభుత్వ ప్రయత్నాలు అయినా అక్కడ కాలుష్య సమస్య నుంచి బయటపడటం కష్టమే. ఇప్పుడు అలాంటి పరిస్థితే హైదరాబాద్‌లోనూ కనిపిస్తోంది. జంటనగరాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది.
సనత్‌నగర్‌లో అత్యంత ప్రమాదకర స్థాయికి AQI
హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సోమవారం రోజున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 431 గా నమోదైంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు దీనిపై హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఉదయం కాస్త మెరుగుపడినప్పటికీ, సాయంత్రం నాటికి 300 పైకి AQI చేరుకుంది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రస్తుతం నగరంలోని AQI 259 గా ఉంది.
పర్యావరణ నిపుణులు ఈ పరిస్థితిని ఆందోళనకరంగా భావిస్తున్నారు. సనత్‌నగర్‌లో అధికంగా పారిశ్రామిక కర్మాగారాలు ఉండటంతో వాయు కాలుష్యం ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. కానీ, గతంలో ఎన్నడూ లేనంతగా సోమవారం రోజున 450 AQI చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం.
ఏక్యూఐ స్థాయిలు & ప్రమాద సూచనలు:
- 0 – 50: గాలి స్వచ్ఛంగా ఉంటుంది
- 51 – 100: సహజంగా నిస్తేజత ఉండొచ్చు
- 101 – 200: కొంతమందికి ఆరోగ్య సమస్యలు రావొచ్చు
- 201 – 300: అనారోగ్య సమస్యలు అధికమవుతాయి
- 301 – 400: తీవ్రమైన కాలుష్య ప్రభావం
- 401 – 500: అత్యంత ప్రమాదకరం
ఇప్పుడు హైదరాబాద్ AQI 450కి చేరుకోవడం తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. గత 6 నెలలుగా నగరంలో వాయు నాణ్యత తరచూ పడిపోతోంది. శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో కాలుష్యం అత్యధికంగా నమోదవుతోంది.
సర్కార్ తక్షణ చర్యలు తీసుకోకపోతే…
హైదరాబాద్‌లో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే, హైదరాబాద్ మరో ఢిల్లీగా మారడం పెద్ద సమయం పట్టదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే, సర్కార్ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.