హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా ఓల్డ్ సిటీలో మెట్రో పనులను నిలిపివేయాలంటూ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసింది.

ఈ పిల్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల సమయం కోరింది. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ప్రభుత్వం ఎంజీ బస్ స్టేషన్ నుంచి ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ పనులను చేపట్టింది.
మెట్రో విస్తరణలో కీలకమైన భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 7.5 కిలోమీటర్ల పొడవులో మెట్రో నిర్మాణం జరగనుంది. ఫేస్-2లో ఇది తొలి కారిడార్ కానుండగా, ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులను సేకరించేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ క్రమంలో 800 ఆస్తులకు నోటిఫికేషన్‌ను పలు దశల్లో జిల్లా రెవెన్యూ అధికారులు అందజేశారు. మొదటి దశలో ప్రైవేట్ ఆస్తులకు పరిహారం చెల్లించడం ప్రారంభమైంది. కొన్ని చోట్ల కూల్చివేతలు కూడా మొదలయ్యాయి. భూములను స్వచ్ఛందంగా అందించేందుకు యజమానులతో సంప్రదింపులు కొనసాగుతుండగా, సమస్యాత్మక ఆస్తుల సేకరణపై అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పనులు ఆపాలంటూ పిల్ దాఖలు కావడం ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.